‘బ్లఫ్ మాస్టర్’ మూవీ రివ్యూ

0
275
రివ్యూ : బ్లఫ్ మాస్టర్
తారాగణం : సత్యదేవ్, నందిత శ్వేత, బ్రహ్మాజీ, ఆదిత్య మీనన్, సిజ్జు
సంగీతం : సునిల్ కశ్యప్
నిర్మాత : రమేష్ పి. పిల్లై
దర్శకత్వం : గోపి గణేశ్ పట్టాభి
కొన్ని సినిమాల ట్రైలర్స్ చూడగానే తెలిసిపోతుంది. బ్లాక్ బస్టర్ అనో లేక సూపర్ హిట్ అనో ఫిక్స్ కాలేం కానీ ఖచ్చితంగా ఆకట్టుకుంటాయనిపిస్తుంది. అలా అనిపించిన ట్రైలర్ బ్లఫ్ మాస్టర్. టాలెంటెడ్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న సత్యదేవ్ హీరోగా నటిస్తున్నాడనగానే చాలామంది అతను బాగా చేస్తాడని కూడా అనుకున్నారు. ఈ టాక్స్ కు తోడు కాస్త ఫర్వాలేదనిపించేలా ప్రమోషన్స్ కూడా చేశారు. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లోనే కాదు పరిశ్రమలోనూ కొంత ఆసక్తి ఏర్పడింది. మరి ఆ సినిమా ఎలా ఉంది.. అనేది ఇప్పుడు చూద్దాం..
కథ :
మోసం చేయడమే వృత్తిగా బ్రతికే వ్యక్తి ఉత్తమ్ కుమార్(సత్యదేవ్). చిన్నతనంలో తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా.. ఊరికో పేరుతో డబ్బే లోకంగా బ్రతికేస్తుంటాడు. మనుషుల బలహీనతలే లక్ష్యంగా రకరకాల స్కీములు పెట్టి పెద్ద పెద్ద స్కాములు చేస్తుంటాడు. అలా ఓ స్కామ్ చేస్తున్న టైమ్ లో అతనికి అవని(నందిత శ్వేత)పరిచయం అవుతుంది. తనను కూడా తనకు తెలియకుండా మోసంలో భాగస్వామ్యం చేస్తాడు. మోసం బయటపడుతుంది. దీంతో అక్కడి నుంచి వెళ్లి మరో కొత్త మోసానికి ప్రయత్నిస్తూ పోలీస్ లకు దొరుకుతారు. జైల్లో ఎన్ని దెబ్బలు కొట్టినా తను తప్పు చేయలేదనే చెబుతాడు. మొత్తంగా తను అక్రమంగా సంపాదించిన డబ్బుతోనే మళ్లీ తను నిర్దోషిగా బయటకు వస్తాడు. జైలు నుంచి రాగానే అతన్ని కొందరు కిడ్నాప్ చేస్తారు. ఇటు ఫ్రెండ్స్ మోసం చేస్తారు..? అతన్ని కిడ్నాప్ చేసింది ఎవరు..?ఎందుకు..? ఫ్రెండ్స్ మోసం వెనక కారణాలేంటీ..? అవని ఎటు వెళ్లింది.. చివరికి ఏమైంది అనేది మిగతా కథ..
వివరంగా :
తెలుగు సినిమా మారుతోంది అన్న దగ్గర్నుంచీ మారింది అనేమాటకు దగ్గరలో ఉన్నాం. అందుకే సరికొత్త ప్రయత్నాలతో సినిమాలు వస్తున్నాయి. వీటిలో చాలా సినిమాలు విజయం సాధిస్తుండటంతో ఆ తరహా ఆలోచనాత్మక కథలూ పెరుగుతున్నాయి. ఆ కోవలో రియాలిటీకి దగ్గరగా వచ్చిన సినిమానే ఈ బ్లఫ్ మాస్టర్. తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన శతురంగ వేట్టై అనే సినిమాకు రీమేక్ గా వచ్చిన చిత్రం ఇది. వైట్ కాలర్ నేరగాళ్ల బట్టలు ఊడదీసిన సినిమాగా చెప్పొచ్చు. అలాగే అత్యాశకు పోయి సామాన్య జనాలు ఎలా మోసపోతారు అనేదాన్ని అద్భుతంగా క్యాప్చర్ చేశాడు దర్శకుడు. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలన్నీ వాస్తవాలకు అతి దగ్గరగా ఉండటం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్స్ గా చెప్పొచ్చు. ఆయా సన్నివేశాలు చూస్తోన్న ప్రతి ఒక్కరికీ ఏదో రకంగా ఇంటర్ లింక్ అయి ఉండటంతో ప్రేక్షకులు సులువుగా కథనంలో లీనమైపోతారు. ఈ క్రమంలో దర్శకుడు ఇప్పటి వరకూ ఇండియాలో ఇలా మధ్య తరగతి జనాల అత్యాశకు క్యాష్ చేసుకున్న ఎందరో నేరగాళ్ల పనితీరును కాస్త ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. కొన్నిసార్లు సినిమాటిక్ లిబర్టీ ఎక్కువైనా ఇవన్నీ రియాలిటికీ దగ్గరగా ఉండటంతో వాటిని క్షమించొచ్చు. దేశవ్యాప్తంగా వచ్చిన ‘ఆమ్వే’,‘ రెండు తలల పాములు’, ‘ఈము కోళ్లు’, ‘చైన్ లింక్’ బిజినెస్ లు.. వీటి వెనక అసలు ఉద్దేశ్యాలు.. అన్నిటినీ అద్భుతంగా డిస్కస్ చేశాడు. అలాగని ఇదేమీ డాక్యుమెంటరీలానూ ఉండదు. ఎందుకంటే ఆ బ్లఫ్ మాస్టర్ పాత్రలో సత్యదేవ్ నటనతో మెస్మరైజ్ చేస్తాడు. ఎన్నో సన్నివేశాల్లో అతనెంత వాల్యూబుల్ ఆర్టిస్టో నిరూపించుకున్నాడు.
ఫస్ట్ హాఫ్ అంతా చాలా వేగంగా ఇంకా చెబితే పూరీ జగన్నాథ్ స్క్రీన్ ప్లేలా సాగిపోతుంది. కానీ సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి కథనం సడెన్ గా పడిపోతుంది. అప్పటి వరకూ బ్లఫ్ గా సాగిన సన్నివేశాలకు సెంటిమెంట్ రాసుకోవడంతో కథనం బిగి కూడా తగ్గుతుంది. క్లైమాక్స్ లో ‘డెలివరీ’ సీన్ మనం ఎయిటీస్ లో చూసినతరహాలో ఉంటుంది. ఫైనల్ గా దర్శకుడు ఏం చెప్పబోతాడా అని కాస్త నీరసంగా కదులుతోన్న టైమ్ లో మళ్లీ అతను మరో మోసం ‘చేయక తప్పని’ పరిస్థితి క్రియేట్ చేస్తాడు. అప్పటి నుంచి మళ్లీ కథనం వేగంగా మారుతుంది. ఈ క్రమంలో వచ్చే ‘రైస్ ఫుల్లింగ్’ సీన్ తో కథనం పీక్స్ కు వెళుతుంది. తద్వారా వచ్చిన వంద కోట్లను మళ్లీ ఏం చేశాడనేది క్లైమాక్స్ లో తెలుస్తుంది. మొత్తంగా బ్లఫ్ మాస్టర్ సెకండ్ హాఫ్ సగానికి మినహాయిస్తే ఏ మాత్రం డిజప్పాయింట్ చేయని సినిమాగా చెప్పొచ్చు.
యాక్టింగ్ పరంగా సత్యదేవ్ కథ ఆసాంతాన్ని తన భుజాలపై అవలీలగా మోశాడు. అతని నటనే ఈ బలం, హైలెట్. మంచి సినిమాలు పడితే తనెంత వాల్యూబుల్ టాలెంట్ ఇస్తాడో ప్రూవ్ చేశాడు. నందిత శ్వేత పాత్రకు తగ్గట్టుగా నటించింది. ఇతర పాత్రల్లో సిజ్జు, ఆదిత్య మీనన్ ల పాత్రలు హైలెట్ గా ఉన్నాయి. అలాగే పృథ్వీ, బ్రహ్మాజీ తక్కువ సీన్స్ లో ఉన్నా ఎక్కువ ఇంపాక్ట్ వేశారు.
టెక్నికల్ గా .. ఇది దర్శకుడి సినిమా. పూర్తిగా అతని ఆలోచనకు తగ్గట్టుగానే ఆర్టిస్టులు కానీ.. టెక్నీషియన్స కానీ పనిచేశారని చెప్పొచ్చు. అందుకే మ్యూజిక్ బావుంది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. మాటలు ఆలోచింపచేసేవిగా ఉన్నాయ్. ప్రొడక్షన్ వాల్యూస్ గూడ్..
ఫైనల్ గా…  బ్లఫ్ మాస్టర్ విత్ సెంటిమెంట్
రేటింగ్ : 2.75/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here