‘అర‌వింద స‌మేత వీర రాఘ‌వ’ మూవీ రివ్యూ

0
258

ఏదైనా స‌రే ఒక క్రేజీ కాంబినేష‌న్ లో సినిమా వ‌స్తుందంటే ఆ హీరో అభిమానుల‌తో పాటూ, స‌ద‌రు సినిమా అభిమానులకు కూడా ఆ సినిమా మీద ఆస‌క్తి క‌లుగుతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ క‌లయిక‌లో ఎప్పుడెప్పుడు సినిమా వ‌స్తుందా అని ఎప్ప‌టినుంచో ఎదురుచూసారు ప్రేక్ష‌కులు. కేవ‌లం ప్రేక్ష‌కులే కాదు, త‌నకు ఎంతో స‌న్నిహితుడైన త్రివిక్ర‌మ్ డైర‌క్ష‌న్ లో న‌టించాల‌ని ఎన్టీఆర్ కూడా ఎప్ప‌టినుంచో అనుకున్న‌ట్లు, కానీ ఇన్నాళ్ల‌కు కుదిరింద‌ని స‌భాముఖంగానే చెప్పాడు ఎన్టీఆర్. దానికితోడు త్రివిక్ర‌మ్ తొలిసారి త‌న పంథా మార్చి, ఫ్యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్ లో ఒక సినిమాను తీయ‌డం కూడా ఇదే మొద‌టిసారి కావ‌డం, తార‌క్ అందులో హీరోగా న‌టించ‌నుండ‌టంతో సినిమా మీద అంచ‌నాలు అమాంతం పెరిగిపోయాయి. ఎన్నో అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ”అర‌వింద సమేత వీర రాఘ‌వ” వారి అంచ‌నాల‌ను అందుకున్నాడా లేదా చూద్దాం.

క‌థః
గొడ‌వ‌ల కార‌ణంగా వీర రాఘ‌వ రెడ్డి తండ్రి నార‌ప‌రెడ్డి (నాగ‌బాబు)ను చంపుతాడు బసిరెడ్డి (జ‌గ‌ప‌తిబాబు). క‌ళ్ల ముందే తండ్రిని కోల్పోయిన వీర రాఘ‌వ రెడ్డి (ఎన్టీఆర్) బాసిరెడ్డి ని న‌రుకుతాడు. దీంతో బసిరెడ్డి చ‌నిపోయాడ‌ని, ఇక నుంచి ప‌గ‌లు, ప్ర‌తీకారాలు మానేయాల‌ని క‌త్తిని వ‌దిలేసి త‌ర్వాతి త‌ర‌మైనా శాంతితో బ్ర‌త‌కాల‌నే ఉద్ధేశ్యంతో కొన్నాళ్లు ఊరు విడిచి వెళ్తే అన్నీ స‌ర్దుకుంటాయ‌నుకుంటాడు. చ‌నిపోయాడ‌నుకున్న బసిరెడ్డి బ్ర‌తికే ఉంటాడ‌ని త‌న‌ను వెతుకుతున్న వారి ద్వారా తెలుసుకున్న రాఘ‌వ రెడ్డి, అస‌లు గొడ‌వ‌ల‌న్నింటినీ ఎలా ఆపుతాడు అన్న‌దే క‌థ‌.

న‌టీన‌టుల ప్ర‌తిభః
న‌ట‌న అనేది ఒక స్కూల్ అయితే ఆ స్కూల్ కు ప్రిన్సిప‌ల్ ఎన్టీఆర్. కొత్త‌గా త‌న గురించి చెప్పాల్సింది, ప్రేక్ష‌కులు తెలుసుకోవాల్సిందీ ఏమీ లేదు. ప్ర‌తీ సినిమాతో త‌న‌ను తాను ఇంప్రూవ్ చేసుకుంటూ, మెచ్యూర్డ్ గా క‌నిపిస్తూ త‌న న‌ట‌న‌ను నిరూపించుకుంటూనే ఉన్నాడు. ప్ర‌తీ మూమెంట్ ను ఎంజాయ్ చేసే ల‌వ‌ర్ బాయ్ గా, తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్న కొడుకుగా, స‌మాజం ప‌ట్ల బాధ్య‌త ఉన్న పౌరుడిగా ఎన్టీఆర్ అద్భుతంగా జీవించాడు. ముఖ్యంగా ఎమోష‌నల్ సీన్స్ లో ఎన్టీఆర్ అందరితో కంట‌త‌డి పెట్టిస్తాడు (లేదా) పెట్టించ‌డం ఖాయం. అస‌లు గొడ‌వ‌లు రాకుండా చూసుకోవ‌డ‌మే మ‌నిషి గొప్ప ల‌క్షణం అనుకునే అర‌వింద పాత్ర‌లో పూజా హెగ్డే బాగా చేసింది. జ‌గ‌ప‌తి బాబు గురించి ఎంత చెప్పినా త‌క్కువే. అస‌లు ఆయ‌న్ను చూడాలన్నా భ‌యం వేసేలా క్యారెక్ట‌ర్ ను డిజైన్ చేశారు. క్యారెక్ట‌ర్ ను డిజైన్ చేయ‌డ‌మే కాదు, అత‌ని న‌ట‌న కూడా అదే రేంజ్ లో ఉంది. చాలా సంవ‌త్సరాల త‌ర్వాత ఒక క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా ప్ర‌య‌త్నం చేసిన సునీల్ మంచి మార్కులే కొట్టేశాడు. జ‌గ‌ప‌తి బాబుకు స‌పోర్ట్ గా ఉండే పాత్ర‌లో న‌వీన్ చంద్ర బాగా చేశాడు. నాగ‌బాబు పాత్ర ఉండేది కాసేపే అయినా మంచి ప్రాధాన్య‌త ఉన్న పాత్ర ద‌క్కింది. పొలిటిక‌ల్ లీడ‌ర్ గా రావు ర‌మేష్ తన స్టైల్ లో అద‌రగొట్టాడు. హీరోయిన్ చెల్లెలుగా త‌న పాత్ర‌కు న్యాయం చేసింది. వారిలో సితార‌, దేవ‌యాని, న‌రేష్, శ్రీనివాస రెడ్డి, శ‌త్రు లు త‌మ త‌మ పరిధుల్లో బాగా చేశారు.

సాంకేతిక నిపుణులుః
ఎప్పుడూ పంచ్‌లు, ప్రాస‌ల‌కే ప్రాధాన్యమిచ్చే మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ఈసారి త‌న రూట్ మార్చి ఫ్యాక్ష‌న్ జాన‌ర్ లో సినిమా తీసాడు, అస‌లు త‌న‌కేమాత్రం అల‌వాటు లేని జాన‌ర్ ని త్రివిక్ర‌మ్ ఎలా మెయింటెయిన్ మేనేజ్ చేస్తాడా అనుకున్న వారంద‌రికీ, ఫ్యాక్ష‌న్ సినిమాలంటే కేవ‌లం ఫైట్లు మాత్ర‌మే కాదు, ”క్ష‌మించ‌మ‌ని” అడ‌గ‌డం కూడా.. అనేలా క‌థ‌ను త‌యారు చేసుకోవ‌డంలోనే త్రివిక్ర‌మ్ త‌న మార్క్ చూపించాడు. మొద‌టి 20 నిమిషాల‌కే త్రివిక్ర‌మ్ ఈజ్ బ్యాక్ అనే రేంజ్ లో స్టోరీని రాసుకున్నాడు త్రివిక్ర‌మ్. కాక‌పోతే త‌ర్వాత వ‌చ్చే ల‌వ్ ట్రాక్ కాస్త నెమ్మ‌దిగా సాగుతుంది త‌ప్పించి, ఎక్క‌డా క‌థ‌ను ప‌క్క‌దారి ప‌ట్టించ‌లేదు. అవ‌స‌రం లేకుండా కామెడీ ట్రాక్ లు పెట్టి, దాంట్లో ప్రాసల‌తో కూడా పంచ్ డైలాగులు వాడ‌లేదు. ర‌చ‌యిత‌గా త్రివిక్ర‌మ్ మ‌రోసారి త‌న పెన్ ప‌వ‌ర్ చూపించాడు. త‌న మార్క్ డైలాగుల‌తో త్రివిక్ర‌మ్ త‌న స‌త్తా చూపాడు. అప్ప‌టివ‌ర‌కు అస‌లు త‌న భ‌ర్త పేరును ఎవ‌రైనా అడిగినా కానీ చెప్ప‌డానికి సిగ్గు ప‌డే ఒక సీమ ఆడ‌ప‌డుచు, త‌న కొడుకును చంపాడ‌న్న కార‌ణంతో ఒరేయ్ అంటూ పేరు పెట్టి పిలిచే సీన్ లాంటివి త్రివిక్ర‌మ్ లోని ర‌చ‌యిత గురించి చెప్ప‌డానికి ఇదొక్క‌టి చాలు. త‌ను చెప్పాల‌నుకున్న‌ది సింపుల్ గా అంద‌రికీ అర్థ‌మ‌య్యేట్లు చెప్ప‌డంలో త్రివిక్ర‌మ్ దిట్ట అని మ‌రోసారి ప్రూవ్ చేసుకున్నాడు. పెంచ‌ల్ దాస్ ఈ సినిమాకు చేసిన మాట సహకారం సినిమాలో కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. సీమ ప్రాంత‌పు యాస‌, వారి క‌ట్టుబాట్లు మీద చాలానే గ్రౌండ్ వ‌ర్క్ చేసిన‌ట్లున్నాడు త్రివిక్ర‌మ్. ఇక పి.ఎస్ వినోద్ సినిమాటోగ్ర‌ఫీ చాలా చాలా బావుంది. ప్ర‌తీ ఫ్రేమ్ ఎంతో రిచ్ గా, చూడ‌టానికి విజువ‌ల్ వండ‌ర్ లా ఉంది. సీమ ప్రాంతాల‌ను, ప‌ట్ట‌ణ వాతావ‌ర‌ణాన్ని బాగా చూపించారు. థ‌మ‌న్ సంగీతం గురించి చెప్ప‌క్క‌ర్లేదు. ఆల్రెడీ పాట‌ల‌కు మంచి పేరొచ్చింది. ఈ సినిమా కోసం థ‌మ‌న్ ప‌డిన క‌ష్టాన్ని ప్ర‌తీ ఒక్క‌రూ ఛాన్స్ దొరికితే చాలు తెగ చెప్పేశారు. థ‌మ‌న్ అందుకు అర్హుడేనా అని చాలా మంది అనుకున్నారు కానీ సినిమా చూశాక అర్థ‌మ‌వుతుంది థ‌మ‌న్ నిజంగా సినిమా కోసం ప్రాణం పెట్టి ప‌ని చేశాడ‌ని. రీరికార్డింగ్ కోసం త‌ను ఎంత క‌ష్టప‌డి ఉండ‌క‌పోతే ఈ రేంజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వ‌గ‌లిగి ఉంటాడు? ప‌్ర‌తీ సీన్ ను త‌న మ్యూజిక్ తో ఎలివేట్ అయ్యేలా చేసి, సినిమాను త‌ర్వాతి స్థాయికి తీసుకెళ్లేలా చేశాడు థ‌మ‌న్. హారికా హాసినీ క్రియేష‌న్స్ వారు ఎప్ప‌టిలాగే ఎక్క‌డా ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా మంచి నిర్మాణ విలువ‌లు పాటించారు.

ప్ల‌స్ పాయింట్స్ః
ఎన్టీఆర్ న‌ట‌న‌
త్రివిక్ర‌మ్ ర‌చ‌న‌
ఫ‌స్టాఫ్ మొదటి 20 నిమిషాలు
థ‌మ‌న్ సంగీతం
సినిమాటోగ్ర‌ఫీ

మైన‌స్ పాయింట్స్ః
స్లో నెరేష‌న్

పంచ్‌లైన్ః వీర రాఘ‌వుడి విజ‌య‌మిది 

ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here