‘అంత‌రిక్షం’ మూవీ రివ్యూ

0
494

మాస్ , క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చూసీ చూసీ విసుగెత్తిన ప్రేక్ష‌కులు కొత్త‌ద‌నాన్ని కోరుకుంటున్నారు. అందుకే ద‌ర్శక నిర్మాత‌లు నవ్యాలోచ‌న‌ల‌కు జ‌ల్లెడ ప‌డుతున్నారు. ఘాజీ లాంటి సినిమాలు పుట్టుకురావ‌డానికి కార‌ణం ఈ అన్వేష‌ణే. జ‌లాంత‌ర్గామి చుట్టూ ఓ క‌థ న‌డిపి శ‌భాష్ అనిపించుకున్న సంక‌ల్ప్ రెడ్డికి ఈసారి వ‌చ్చిన త‌న ఆలోచన అంత‌రిక్షంను తాకింది. అనంత విశ్వంలో జ‌రిగే అద్భుతాల్ని తన‌కు వ‌చ్చిన ఆలోచ‌న‌ను జ‌త‌చేసి.. వ‌రుణ్ తేజ హీరోగా ‘అంత‌రిక్షం’ అనే సినిమాను తెర‌కెక్కించాడు.

భార‌త‌దేశం పదకొండేళ్ల క్రితం కక్ష్యలోకి పంపిన శాటిలైట్ ‘మిహిర’లో సమస్య తలెత్తుతుంది. దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనికేషన్ సిస్టమ్‌ స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడుతుందని ఇండియన్ స్పేస్ సెంటర్ భయపడుతుంది. దాని కోడింగ్‌ను కేవలం దేవ్ (వరుణ్ తేజ్) మాత్రమే సరిచేయగలడని భావించి.. ఐదేళ్ల క్రితం ఉద్యోగం మానేసి ఓ ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు చెప్పుకుంటున్న అతన్ని తిరిగి రప్పిస్తుంది. మిహిరలో ఉన్న సమస్యను పరిష్కరించడానికి తాను కూడా అంతరిక్షంలోకి వెళ్లాలని దేవ్ కోరతాడు. దీంతో దేవ్‌ను మరో ముగ్గురు వ్యోమగాములతో కలిపి స్పేస్‌లోకి పంపుతారు. వీరు నలుగురూ కలిసి మిహిరలో సమస్యను సరిచేస్తారు. అయితే భూమిపైకి తిరిగి రావడానికి దేవ్ అంగీకరించడు. ‘మిషన్ కిన్నెర’ను తెరపైకి తీసుకొస్తాడు. ఇంతకీ ఏంటీ మిషన్ కిన్నెర అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

త‌న కెరీర్ ప్రారంభం నుంచి ప్రయోగాలు చేస్తూ వ‌స్తున్న వ‌రుణ్ తేజ్ ప్ర‌తీ సినిమాతోనూ న‌టుడిగా ప‌రిణితి చెందుతూనే ఉన్నాడు. ఈ సినిమాలో కూడా సైంటిస్ట్ గా, ప్రేమికుడిగా, వ్యోమ‌గామిగా చాలా మంచి న‌ట‌న‌ను క‌న‌బ‌రిచి దేవ్ పాత్ర‌కు ప్రాణం పోసాడు. రియా పాత్ర‌లో అదితి రావ్ హైదారి న‌ట‌న సింప్లీ సూప‌ర్బ్. అటు లుక్స్ ప‌రంగానూ, ఇటు న‌ట‌న ప‌రంగానూ మంచి మార్కులు కొట్టేసింది. లావ‌ణ్య త్రిపాఠి పాత్ర ఇంచుమించు గెస్ట్ రోల్ పాత్రే అయినా ఉన్న కాసేపు త‌న అందంతో, అభిన‌యంతో ఆక‌ట్టుకుంది. ఇత‌ర పాత్ర‌ల్లో రాజా , స‌త్య‌దేవ్, శ్రీనివాస్ అవ‌స‌రాల‌, రెహ‌మాన్ త‌మ పరిధి మేర బాగా చేశారు.

ఘాజీ సినిమాతో సినీ ప‌రిశ్ర‌మ‌కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి, మొద‌టి సినిమాతోనే నేష‌న‌ల్ అవార్డు అందుకున్న సంక‌ల్ప్ రెడ్డి ఈ సారి కూడా అలాంటి త‌ర‌హా ప్ర‌య‌త్న‌మే చేశాడు. అంత‌రిక్షం పేరుతో తెలుగు తెర‌పై చూడ‌ని కొత్త విజువ‌ల్స్ ను ఆడియ‌న్స్ కు చూపించాడు. అస‌లు స్పేస్ లో శాటిలైట్స్ గ‌మ‌నం ఎలా ఉంటుంది? వ‌్యోమ‌గాములు అంత‌రిక్షంలోకి వెళ్తే వాళ్ల క‌ద‌లిక‌లు ఎలా ఉంటాయ‌నే విష‌యాలు క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించాడు. ఫ‌స్టాఫ్ అంతా పాత్ర‌ల ప‌రిచ‌యం, దేశం ముందున్న స‌మ‌స్య‌ను ప‌రిచ‌యం చేసిన ద‌ర్శ‌కుడు, సెకండాఫ్ మొత్తం అంత‌రిక్షంలోనే న‌డిపించాడు. విజువ‌ల్ గా సినిమా బావున్న‌ప్ప‌టికీ ప్రేక్ష‌కుడిని అంత‌రిక్షం మూడ్ లోకి తీసుకెళ్ల‌డంలో ద‌ర్శ‌కుడు విఫ‌ల‌మ‌య్యాడు. న‌లుగురు వ్యోమ‌గాములు అంత‌రిక్షంలోకి వెళ్లి, మిహిర శాటిలైట్ దగ్గ‌ర‌కు వెళ్తారు. అక్క‌డ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డానికి 3 నిమిషాల స‌మ‌యం మాత్ర‌మే ఉంటుంది. ఇక్క‌డ ప్రేక్ష‌కుడిలో కాస్త క్యూరియాసిటీని క్రియేట్ చేసి ఇంట‌ర్వెల్ బ్రేక్ ఇచ్చారు. త‌ర్వాత ఆర్బిట్, గ్రాటిట్యూడ్, మూన్, డీవియేష‌న్ ఇలాంటి ప‌దాలు వాడి, కొన్ని ఎమోష‌న‌ల్ సీన్స్ తో అంత‌రిక్షంలోనే క‌థ‌ను న‌డిపించాడు. అస‌లు వ్యోమ‌గాములు ఎలాంటి కోడ్స్ వాడ‌తారు? వారికి వారు ఎలా క‌మ్యానికేట్ చేసుకుంటారు లాంటి అంశాల్లో సంక‌ల్ప్ చేసిన రీసెర్చ్ తెర మీద స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. సెకండాఫ్ లో పెద్ద‌గా క‌థ లేక‌పోయినా.. త‌న క‌థ‌నంతో ఆడియ‌న్స్ ను క‌ట్టిప‌డేసాడు ద‌ర్శ‌కుడు.ఇక సినిమాకు విజువ‌ల్స్ చాలా ప్ల‌స్. స్పేస్ లో ఉండే ప‌రిస్థితుల‌ను తెర‌మీద క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టుగా చాలా బాగా చూపించాడు జ్ఞాన శేఖ‌ర్. ఇక ఆర్ట్ డైర‌క్ట‌ర్స్ ప‌నిత‌నం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. అంత‌రిక్షం అంటే ప్రేక్ష‌కుల్ని ఆకాశ మార్గాన తీసుకెళ్లాలి క‌దా అందుకే అంత‌రిక్షాన్ని నేల‌కు దించి సెట్ రూపంలో వేసి రాకెట్స్ అంటే ఇలానే ఉంటాయ‌ని చూపించారు. ప్ర‌శాంత్ విహారి సంగీతం సినిమాకు మంచి మూడ్ ను క్రియేట్ చేసింది. ఎడిటింగ్ బావుంది కానీ గ్రాఫిక్స్ అక్క‌డ‌క్క‌డా ఓకే అయిన‌ప్ప‌టికీ కొన్నిచోట్ల చాలా నాసిర‌కంగా అనిపిస్తుంది. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి తగ్గ‌ట్టుగా ఉన్నాయి.

ప్ల‌స్ పాయింట్స్ః
లీడ్ యాక్ట‌ర్స్ న‌ట‌న‌
మ్యూజిక్
సినిమాటోగ్ర‌ఫీ
సెకండాఫ్

మైన‌స్ పాయింట్స్ః
ఫ‌స్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్

పంచ్‌లైన్ః మిష‌న్ అంత‌రిక్షం స‌క్సెస్‌.
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here