‘అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ’ మూవీ రివ్యూ

0
209

సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎక్కువ‌గా కాంబినేష‌న్ల మీద , సెంటిమెంట్ల చుట్టూనే టాపిక్స్ న‌డుస్తుంటాయి. అందుకే ఏదైనా హీరో- డైర‌క్ట‌ర్ కాంబినేష‌న్ లో కానీ.. హీరో- హీరోయిన్ కాంబినేష‌న్ లో సినిమాలొచ్చి.. అవి హిట్ అయ్యాయంటే.. త‌ర్వాత వారి క‌ల‌యికలో సినిమా వ‌స్తుందంటే ఇక సినిమా స‌గం హిట్ అయిన‌ట్లే ఫీలైపోతుంటారు. వెంకీ, దుబాయ్ శీను లాంటి మూడు బ్లాక్ బ్ల‌స్ట‌ర్స్ త‌ర్వాత మ‌ళ్లీ ర‌వితేజ‌- శ్రీను వైట్ల కాంబినేష‌న్ లో వ‌స్తున్న అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ. ఇన్నాళ్ల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్, చాలా కాలం త‌ర్వాత బాలీవుడ్ నుంచి మ‌ళ్లీ టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్న ఇలియానా ఈ సినిమాకు హీరోయిన్ అవ‌డం, మంచి అభిరుచి గ‌ల నిర్మాత‌లు గా పేరు తెచ్చుకున్న మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుండ‌టంతో సినిమా మీద కాస్త అంచనాలైతే ఉన్న‌ప్ప‌టికీ.. శ్రీను వైట్ల ఈ సారైనా హిట్ కొట్టి.. త‌న మీదున్న ”కాలం చెల్లిపోయిన శ్రీను వైట్ల కాన్సెప్టులు” అనే ట్యాగ్ లైన్ ను తీసేయ‌గ‌ల‌డా అనే డౌట్లు కూడా చాలా మందికి ఉన్నాయి. ఇన్నింటి మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ తో శ్రీను వైట్ల బౌన్స్ బ్యాక్ అయ్యాడా? లేదా అన్న‌ది స‌మీక్ష‌లో చూద్దాం.

రవితేజ (అమర్) – ఇలియాన (ఐశ్వర్య) పెరెంట్స్‌ మంచి ఫ్రెండ్స్. న్యూయార్క్‌ లో కలిసి బిజినెస్ చేస్తుంటారు. తమ కంపెనీలో పని చేసే నలుగురు ఎంప్లాయిస్ (విలన్ )కి, తమ కంపెనీలో 20% షేర్ ఇచ్చి.. వాళ్ళని ఫ్యామిలీ మెంబర్స్ గా ట్రీట్ చేస్తారు. కానీ వాళ్లు అమర్ , ఐశ్వర్య పేరెంట్స్ ని చంపేస్తారు. అయితే వారి నుండి అమ‌ర్- ఐశ్వ‌ర్య‌లు మాత్రం త‌ప్పించుకుంటారు. ఆ తరువాత అమ‌ర్ ఆ నలుగురు పై ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు. ఈ క్ర‌మంలో అమర్ డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ తో బాధ పడుతూ ఉంటాడు. ఆ డిజార్డర్ వ్యాధితో స‌త‌మ‌త‌మ‌వుతున్నా.. ఆ నలుగురుని అమర్ ఎలా చంపుతాడు. చిన్న‌త‌నంలో దూరమయిన ఐశ్వ‌ర్య‌ను అమర్ మళ్ళీ ఎలా క‌లుసుకుంటాడు..? ఈ అంశాల చుట్టూ అల్లుకున్న క‌థే అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ సినిమా.

సినిమాలో మూడు పాత్ర‌లు పోషించిన ర‌వితేజ.. అమ‌ర్ గా ఆక‌ట్టుకున్నాడు. మిగ‌తా రెండు పాత్ర‌లు అక్బ‌ర్, ఆంటోనీ ల పాత్ర‌లు మాత్రం స‌హ‌జంగా అనిపించ‌వు. సినిమాలో ర‌వితేజ స్టైలింగ్ చాలా బావుంది. చాలా రోజుల త‌ర్వాత గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తుండ‌టంతో ఆమె పాత్ర ఎలా ఉంటుందా అని ఎదురుచూసిన వారంద‌రికీ నిరాశ త‌ప్ప‌దు. ఒక‌ప్పుడు స‌న్నటి న‌డుముతో ఆమె అందాన్ని చూసిన ప్రేక్ష‌కుడు.. ఇప్పుడు ఇంత బొద్దుగా చూడ‌టం క‌ష్ట‌మే అనిపించిన‌ప్ప‌టికీ.. త‌న న‌ట‌న‌తో మెప్పించింది. మంచి మంచి క‌మెడియ‌న్లున్న‌ప్ప‌టికీ పెద్ద‌గా వాడుకోలేదు. క‌మెడియ‌న్ స‌త్య కామెడీ మాత్రం న‌వ్వు తెప్పిస్తుంది. త‌న బాడీ లాంగ్వేజ్ తో మ‌రోసారి త‌న‌లోని కామెడీని బ‌య‌ట‌పెట్టాడు. మిగ‌తా న‌టీన‌టులు త‌మ పాత్ర‌ల మేర‌కు బాగానే చేశారు.

”క‌ర్మ‌.. దాని నుంచి త‌ప్పించుకోవ‌డం ఎవ్వ‌రి వ‌ల్లా కాదు..” అని ఈ సినిమాలో హీరోతో చెప్పించాడు ద‌ర్శ‌కుడు శ్రీను వైట్ల‌. దానికి అత‌ను కూడా అతీతుడు కాదేమో అని త‌ప్ప‌క అనిపిస్తుంది. ఒక‌ప్పుడు మంచి మంచి ఎంట‌ర్‌టైనర్స్ తీసిన శ్రీను వైట్ల యేనా ఇలాంటి సినిమాలు తీస్తుంది.. ‘ఖ‌ర్మ’ కాక‌పోతే ఇంకేంటి? ఎప్పుడో ప‌దేళ్లకు ముందు వ‌చ్చిన సినిమాను చూసి.. దాన్ని కాస్త అటూ ఇటూ మార్చి సినిమా తీసి హిట్ కొట్టేద్దామ‌నుకున్నాడు బానే ఉంది. ఆల్రెడీ ఎప్పుడో వ‌చ్చిన సినిమా లైన్ ను తీసుకుని కూడా హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ ఎంతో పక‌డ్బందీగా వ‌ర్క్ చేసి స్క్రిప్ట్ రాసుకుని.. స్క్రీన్ ప్లే జ‌త చేస్తే కానీ అలాంటి అద్భుతాలు జ‌ర‌గ‌వు. అదేమీ లేకుండా ఏదో ట్రై చేసామంటే ట్రై చేసామన్న‌ట్లు ఉంటే ఫ‌లితం అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ లాగానే ఉంటుంది. క‌థ‌ను ప‌క్క‌న పెడితే కామెడీ ఏమైనా పెద్ద ఎత్తున ఉందా అంటే అది కూడా ఆశించిన స్థాయిలో లేదు. ఎప్పుడైనా హీరోయిజం ఎలివేట్ అవాలంటే.. త‌న‌కెదురు బ‌ల‌మైన విల‌న్లుండాలి. కానీ ఈ సినిమాలో అలాంటి బ‌ల‌మైన పాత్ర‌లేమీ ఉండ‌వు. ఇక సినిమాకు మేజ‌ర్ ప్ల‌స్ పాయింట్ అంటే సినిమాటోగ్ర‌ఫీ. ప్ర‌తీ ఫ్రేమ్ ఎంతో క‌ల‌ర్‌ఫుల్ గా, అందంగా, లావిష్ గా క‌నిపిస్తుంది. సినిమా మొత్తం చాలా రిచ్ గా చూపించారు. థ‌మ‌న్ సంగీతంలోని పాట‌లు అస‌లేమాత్రం ఆక‌ట్టుకోక‌పోయినా.. రీరికార్డింగ్ మాత్రం బావుంది. నిర్మాత‌లు మైత్రీ మూవీ మేక‌ర్స్ ఖ‌ర్చుకు వెనుకాడ‌కుండా సినిమాను రిచ్ గా తెర‌కెక్కించారు.

పంచ్‌లైన్ః అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ – ‘అత‌నొక్క‌డే’!
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 1.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here