‘2.0’ మూవీ రివ్యూ

0
372

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ సినిమా అంటే తెలుగు, త‌మిళ నాట మామూలు క్రేజ్ కాద‌ని మ‌నకి తెలిసిందే. దానికి తోడు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా కావడం, రోబో కి సీక్వెల్ కావ‌డంతో సినిమాపై అంచ‌నాలు పెర‌గ‌డం స‌హ‌జం. కానీ వీరిద్ద‌రి కాంబినేష‌న్ కంటే వీఎఫ్ఎక్స్ నేప‌థ్యంలో ఎక్కువ హైప్ క్రియేట్ చేసుకున్న సినిమా 2.0. మ‌రి ఊహ‌కంద‌ని అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ల‌కు ర‌ప్పించిన 2.0 వాటిని నిల‌బెట్టుకుందో లేదో చూద్దాం.

చెన్నై నగరంలో హఠాత్తుగా అందరి చేతుల్లో సెల్ ఫోన్లు మాయమవడం మొదలవుతుంది. కారణం ప్రభుత్వానికి అంతు చిక్కదు. ఈ లోపు మొబైల్ షో రూమ్ ఓనర్ ఓ కంపెనీ సీఈఓ మినిస్టర్లు ఆ అదృశ్య శక్తి ద్వారా హత్య చేయబడతారు.దాన్ని పట్టుకోవడానికి సైంటిస్ట్ వసీకరన్(రజనీకాంత్)సహాయం కోరుతుంది గవర్నమెంట్. తన అసిస్టెంట్ హ్యూమనాయిడ్ రోబో వెన్నెల(అమీ జాక్సన్)సహయంతో డీ యాక్టివ్ చేసిన చిట్టి(రజనీకాంత్)కి తిరిగి ప్రాణం పోస్తాడు వసీకరన్. చిట్టి సహయంతో ఇదంతా గతంలో ఉరి వేసుకుని చనిపోయిన పక్షి రాజు(అక్షయ్ కుమార్)చేస్తున్నాడని తెలుస్తుంది తెలివిగా వేసిన స్కెచ్ వల్ల చిట్టి చనిపోయి వశీకరన్ శరీరంలో పక్షిరాజు ప్రవేశించి కుట్రలు చేయడం మొదలు పెడతాడు. అప్పుడు జరుగుతున్న విధ్వంసం ఆపడం కోసం 2.0(రజనికాంత్)బయటికి వస్తాడు. దాని తర్వాత 2.0కు, పక్షి రాజు మధ్య ఏం జ‌రిగింద‌నేది మిగ‌తా క‌థ‌.

రజినీకాంత్ ఇమేజ్ చట్రం నుంచి బయటికి వచ్చి మాస్ ఫార్ములాకు భిన్నంగా రోబో ఒప్పుకున్నప్పుడు ఎంత వరకు మెప్పించగలుగుతారు అనే దాని మీద కలిగిన అనుమానాలను తన అద్భుతమైన నటనతో ఆ అనుమానాలన్నింటికీ త‌న న‌ట‌న‌తో చెంప ప‌గుల‌కొట్టేట్లు స‌మాధానం చెప్పారు. ఇది దానికి కొన‌సాగింపు త‌ప్పించి పెద్ద‌గా తేడా ఏమీ క‌నిపించ‌దు. కాక‌పోతే ఈ వ‌య‌సులో త‌ను ప‌డిన శ్ర‌మ‌ను ఖచ్చితంగా అభినందిచాల్సిందే. రెండు పాత్రల చిట్టిగా మొత్తం వన్ మ్యాన్ షో చేసాడు రజని. త‌న చుట్టూ ఏం లేక‌పోయినా ఊహించేసుకుని ఇంత ఈజ్ తో మెప్పించ‌డమంటే ర‌జ‌నీకే చెల్లింది. ఈ సినిమాలో ర‌జనీని తప్ప చిట్టిగా ఇంకెవరిని ఊహించుకోలేను అన్న శంకర్ మాటకు పూర్తి న్యాయం జరిగింది. అసలు కొన్ని సన్నివేశాల్లో రజని నటన చూస్తే నిజంగా ఇంత ఎనర్జీతో చేసారా లేక గ్రాఫిక్స్ తో మేనేజ్ చేసారా అనేంత అద్భుతంగా చేశారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి 2.0గా మినీ రోబోగా రజని సింప్లీ సూపర్బ్. ఇక పక్షిరాజు అక్షయ్ కుమార్ విలనీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మేకప్ కోసమే కఠోరమైన శ్రమ పడ్డ అక్షయ్ దీని కోసం శారీరకంగా, మానసికంగా పడిన కష్టం తెరమీద స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో పక్షుల బాగు కోసం తపించిపోయే వృద్ధుడిగా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అసలు ఈ పాత్రను స్టార్ ఒప్పుకోవడమే సాహసం. అమీ జాక్సన్ నుంచి గ్లామర్ పరంగా ఆశించకూడదు. తనదీ రోబో పాత్రే కాబట్టి స్కిన్ షో కు ఛాన్స్ దక్కలేదు. వీళ్ళు కాకుండా సినిమాలో గుర్తుండేలా ఏ ఆర్టిస్టు కనిపించరు. రోబో విలన్ డానీ కొడుకు(సుధాంశు పాండే)గా ఓ పాత్రను పెట్టారు కానీ అది కూడా తేలి పోయిన‌ట్ల‌నిపిస్తుంది.

త‌న ప్ర‌తి సినిమాలో బ‌లమైన సందేశమిస్తూనే క‌మ‌ర్ష‌యిల్ ఎలిమెంట్స్ ను మిక్స్ చేసే శంక‌ర్ ఈ సినిమాలో కాస్త ప‌క్క‌దారి ప‌ట్టాడ‌నిపిస్తుంది. ప‌క్షులు అంత‌రించిపోవ‌డం వ‌ల్ల మ‌నుషుల‌కు ఎంత ప్ర‌మాద‌మో చెప్ప‌డ‌మ‌నేది ఎంతో మంచి పాయింట్. ఆ పాయింట్ ను చెప్ప‌డానికి ప‌క్షిరాజు అనే క్యారెక్ట‌ర్ ను కూడా ఎంచుకున్నాడు బానే ఉంది కానీ.. ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం మ‌నుషుల మీద ప్ర‌తీకారం తీర్చుకోవ‌డ‌మే అనుకునేలా క‌థ‌నం రాసుకోవ‌డం కాస్త ఎంగేజింగ్ గా అనిపించ‌దు. త‌న‌లో ఉన్న టెక్నీషియ‌న్ ను శంక‌ర్ మ‌రోసారి ఈ సినిమా ద్వారా బ‌య‌ట‌కు తీసాడు శంక‌ర్. ఇండియ‌న్ సినిమాలో ఈ రేంజ్ హాలీవుడ్ మేకింగ్ ని తెర‌మీద ఆవిష్క‌రించినందుకు శంక‌ర్ ను అభినందిచాల్సిందే. కానీ ఎంత గొప్ప విజువ‌ల్స్ ఉన్నా దానికి ఎమోష‌న్స్ స‌రిగా క‌నెక్ట్ అవ‌న‌ప్పుడు ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఖ‌చ్చింతంగా ఉంటుంది. స్టోరీ లైన్ బావున్న‌ప్ప‌టికీ, మంచి టెంపో మిస్ అయింద‌నిపిస్తుంది. అయినా శంకర్ కు దర్శకత్వ పాఠాలు నేర్పడం అంటే గుర్రానికి నడక నేర్పడం లాంటిది. త‌న ఊహా శ‌క్తితో హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్ ను ఇండియ‌న్ సిల్వ‌ర్ స్క్రీన్ పై ప్రెజెంట్ చేయాల‌న్న శంక‌ర్ త‌ప‌న మెచ్చుకోవ‌చ్చు కానీ వాటికి స‌రైన ఎమోష‌న్స్ ను కూడా జోడించే ఉండుంటే 2.0 రేంజే వేరుగా ఉండేది. ఇక నీర‌వ్ షా కెమెరా ప‌నిత‌నం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. క్లైమాక్స్ ని చిత్రీక‌రించిన తీరు న‌భూతో అని చెప్పొచ్చు. రియాలిటీ కంటే గ్రాఫిక్స్ ఎక్కువ‌గా ఉండే సీన్స్ లో ఆయ‌న ప‌నితీరుని చూడొచ్చు. ఏఆర్ రెహ‌మాన్ సంగీతంలో వ‌చ్చిన రెండు పాట‌లు సో సో గానే ఉన్న‌ప్ప‌టికీ, ఆయ‌న మ్యూజిక్ లోని అస‌లు మ్యాజిక్ ఏంటన్న‌ది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మ‌రోసారి నిరూపించుకున్నాడు. ఆంటోనీ ఎడిటింగ్ చాలా క్రిస్పీగా ఉంది. లైకా నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి.

పంచ్‌లైన్ః చిట్టి రోబో చించేశాడు..!
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3.75/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here